అద్భుతాలు.. త్రీడీ చిత్రాలు
The bullet news(nellore)- పాము కదిలేట్లు.. నీటిలో చేపలు వెళుతున్నట్లు.. చేతికందే వస్తువులు అంతలో మాయమయ్యేట్లు.. ఇలాంటి త్రీడీ చిత్రాలు వేయడంలో ఆయన దిట్ట. అంతే కాదు.. ప్రతిచిత్రం ఆలోచింపజేసేదే. ఎంతో కష్టం, క్రియాత్మకతతో కూడుకున్న ఆ చిత్రాలు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరి దగ్గర శిక్షణ తీసుకోకుండా సొంతంగా నేర్చుకున్నారు. అంతర్జాలాన్ని సద్వినియోగం చేసుకొని చక్కని నేర్పు సాధించారు. ఆయనలోని ప్రతిభకు మరింత పదును పెడుతున్నారు. ఈ కళను పలువురికి నేర్పుతూ ముందుకెళుతున్నారు నగరానికి చెందిన పవన్ కుమార్. ఆయన బీటెక్ పూర్తి చేశారు. యానిమేషన్‌లో శిక్షణ తీసుకుని ప్రత్యేక క్రియాత్మక చిత్రాల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. సాంకేతిక జ్ఞానంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. త్రీడీ చిత్రాలు, గ్లాస్, ఆయిల్ పెయింటింగ్స్, కన్‌ఫ్యూజన్, క్రియేటివ్ ఆర్ట్స్, ఇలా ఎన్నో రకరకాల చిత్రాలను వేస్తూ అబ్బురపరుస్తున్నారు. ప్రస్తుతం క్రియేటివ్ యాడ్స్ చేస్తున్న ‘పవన్ కుమార్’పై ప్రత్యేక కథనం. నెల్లూరు నగరానికి చెందిన పవన్ కుమార్ 2009లో బీటెక్ ఈసీఈ పూర్తి చేశారు. 2010లో హైదరాబాద్‌లో యానిమేషన్ కోర్సు నేర్చుకున్నారు. అనంతరం అదే రంగంలో ఉద్యోగం సాధించారు. 2014 వరకు ఉద్యోగం చేసి సొంతంగా ఇన్‌స్టిట్యూట్ నిర్వహించాలని నెల్లూరుకు వచ్చేశారు. యానిమేషన్‌లో పట్టు, సాంకేతికత తోడు కావడంతో పవన్ ఇక వెనక్కు చూసుకున్న పరిస్థితి లేదు. అంతర్జాలంలో చూపించే త్రీడీ చిత్రాలను అచ్చం గుద్దినట్లు వేసేవారు. అందులోని మెలకువలు తెలుసుకుని కనపడే ప్రతి చిత్రాన్ని త్రీడీలో అనువదించేవారు. సాంకేతిక విప్లవంలో ‘త్రీడీ’ ఒక అద్భుతం. ఇప్పుడిప్పుడే త్రీడీ సినిమాలు వస్తున్నాయి. ప్రత్యేకంగా తయారుచేసిన త్రీడీ కళ్లద్దాలతో చూడాల్సి ఉంటుంది. అంతా ప్రత్యేకత చాటిన త్రీడీ చిత్రాలు వేయాలంటే ఎంతో కష్టతరం. చిత్రంలో ఉన్న వస్తువు మనకు దగ్గరగా కనిపిస్తుంది. అందులోని వస్తువులు కదలడం, నిజానికి చాలా దగ్గరగా ఉండేవే త్రీడీ చిత్రాలు. పవన్ కుమార్ త్రీడీ చిత్రాల్లో పలువురికి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇదెంతో కఠినతర శిక్షణ కావడం, ఎంతో జ్ఞానం, సమయం, ఆలోచనా శక్తి అవసరం ఉండటంతో పదుల సంఖ్యలోనే శిష్యులను తయారు చేశారు. సాధారణంగా గోడలకు రంగు రంగుల పెయింటింగ్స్ వేస్తుంటారు. కొందరు ఆయిల్ పెయింటింగ్స్, మరికొందరు ఇతర పెయింటింగ్స్ వాడుతుంటారు. అలా కాకుండా ప్రత్యేకంగా చిత్రాలతో కూడిన పెయింటింగ్ కావాలంటే.. ఆలోచనలకు తగ్గట్లుగా గోడలపై చిత్రాలను ఆవిష్కరించాలంటే పవన్‌కుమార్ దిట్ట. తన ఇల్లు, కార్యాలయంలో ఇవే కనపడతాయి. గోడలపై చిత్రాలు కావాలంటే ఇటీవల మార్కెట్లో వస్తున్న స్టిక్కరింగ్‌తో అతికిస్తారు. వీటికి భిన్నంగా అపురూప చిత్రాలను పవన్ తన పెయింటింగ్స్‌తో ఆవిష్కరిస్తూ ఆశ్చర్యం కలిగిస్తున్నారు. గోడపై 15 అడుగుల చిన్ని కృష్ణుడు,, కొమ్మపై పిచ్చుకలు, తదితర చిత్రాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. చిన్న యాడ్స్ చేస్తున్నాను. భవిష్యత్తులో డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించాను. కార్మికులపై డాక్యుమెంటరీ తీస్తున్నాను. సినిమాలు తీయాలని, అందులో అవార్డులు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
అద్భుతాలు.. త్రీడీ చిత్రాలు
Reviewed by ADMIN
on
March 21, 2018
Rating:
No comments: