తేల్చుకుందాంరా.. పులివెందులలో మీసం మెలేసి మరీ సవాల్..
The bullet news (Kadapa)- పులివెందులలో సమరనాదం మోగింది. బహిరంగ యుద్ధానికి నాయకులు సిద్దమయ్యారు. ఇరువర్గాలు పూలంగల్ల సెంటర్‌ను రాజకీయ రణక్షేత్రంగా ప్రకటించాయి. ఫ్యాక్షన్ సినిమాను తలపించే విధంగా కడప జిల్లా నాయకులు.. కయ్యానికి కాలు దువ్వారు. కత్తులతో యుద్ధం కాదు కానీ.. అంతకంటే పదునైన పరుష పదజాలంతో మాటల యుద్ధం జరుగుతోంది. అభివృధ్ధిపై టీడీపీ, వైసీపీ నాయకులు బహిరంగసభకు చర్చకు సై అంటే సై అంటున్నారు.
ఇటీవల వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కడప జిల్లా అభివృధ్ధికి పైసా ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. దీనిపై ధీటుగా స్పందించారు కడప జిల్లా టీడీపీ నాయకులు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలన్నారు సతీష్ రెడ్డి. దమ్ముంటే చర్చ ద్వారా తేల్చుకుందామని మీసం మెలేసి మరీ సవాల్ విసిరారు. చర్చకు సిద్దమా అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు.
మీడియా, ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామని.. మీరు చెప్పిన సమయం కంటే గంట ముందుగానే వస్తామంటూ సవాలు స్వీకరించారు ఎంపీ అవినాష్ రెడ్డి. సమయం మీరు చెప్పినా.. సరే.. మమ్మల్ని చెప్పమన్న సరే అంటూ చెప్పిన టైంకు గంట ముందే యుద్ధానికి సిద్దమన్నారు. మొత్తానికి కడప గడపలో బహిరంగ రాజకీయ యుద్ధం ఆసక్తిగా మారింది. అటు పోలీసులు, అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. సవాళ్లు చర్చదాకా వస్తాయా? లేక మధ్యలోనే ఆగిపోతాయా? చూడాలి.
తేల్చుకుందాంరా.. పులివెందులలో మీసం మెలేసి మరీ సవాల్..
Reviewed by ADMIN
on
March 03, 2018
Rating:
No comments: