ఇదో మైనరు ప్రేమ కథ
THE BULLET NEWS(LOVE)- వయో పరిణితి లేని ఓ ప్రేమ జంట వేసిన తప్పుటడుగు.. ఇద్దరి జీవితాలను అగమ్యగోచరంగా మార్చింది. న్యాయస్థానానికి సైతం పరీక్ష పెట్టింది. ప్రేమ మైకంలో తొలుత ఒక్కటైన జంట.. పెళ్లికి వచ్చే సరికి మనస్పర్ధలతో దూరమయ్యారు. వీరి వ్యవహారం తేల్చలేక ఇరుపక్షాల పెద్దలు.. పిల్లతో సహా పోలీస్‌స్టేషన్ గడప తొక్కారు. వరదయ్యపాళెం పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా బీఎన్ కండ్రిగ మండలం గాజులపెళ్లూరుకు చెందిన ఓ కుటుంబం కొన్నాళ్ల క్రితం వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరుకు బతుకుదెరువు కోసం వలస వచ్చింది. ఇక్కడి శోత్రియ భూముల్లో వేసుకున్న తాత్కాలిక పాకలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తె తమిళనాడులోని కాంచిపురంలో అత్తింట ఉంటోంది. ఆమెకు కాన్పు సమయంలో సహాయంగా ఉండేందుకు రెండే కుమార్తె (17)ను ఏడాది కిందట కాంచిపురానికి పంపించారు. ఆ సమయంలో సమీపంలో నివాసముండే 16 ఏళ్ల అబ్బాయితో పరిచయం పెంచుకుంది. పెళ్లి చేసుకుందామని చెప్పడంతో.. శారీరకంగా ఒక్కటయ్యారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లోనూ తెలిసింది. కొన్నాళ్లకు ఆ బాలిక చిన్నపాండూరుకు రాగా.. ఆ బాలుడు సైతం ఆమె వెంట వచ్చారు. కొన్నాళ్లు ఇక్కడే సహజీవనం చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని అమ్మాయి ఒత్తిడి చేయడంతో అబ్బాయి తొలుత అంగీకరించాడు. ఇరువురి తల్లిదండ్రులు ఇటీవల వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతలోనే బాలుడు పెళ్లికి నిరాకరించాడు. తాను మోసపోయానని భావించిన అమ్మాయి.. ఫిబ్రవరి 18న ఆత్మహత్యకు యత్నించింది. ఆస్పత్రిలో కోలుకున్న తర్వాత.. మంగళవారం వరదయ్యపాళెం పోలీసులను ఆశ్రయించింది. వీరిద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుకు అనుమతించాలంటూ.. సత్యవేడు కోర్టును అభ్యర్థించామని ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.
ఇదో మైనరు ప్రేమ కథ
Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: