క్యాన్సర్ కేంద్రం ఏర్పాటులో ప్రభుత్వం విఫలం- క్యాన్సర్ హాస్పిటల్ సాధన కమిటీ కన్వీనర్ డాక్టర్ దత్తాత్రేయులు
The bullet news (Nellore)_ జిల్లాకు మంజూరైన టెర్షియరి కేర్ క్యాన్సర్ సెంటర్ (టీసీసీసీ) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని క్యాన్సర్ హాస్పిటల్ సాధన కమిటీ కన్వీనర్ డాక్టర్ దత్తాత్రేయులు ఆరోపించారు. నగరంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2015లో టీసీసీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించిందన్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్‌స్పెక్షన్ బృందం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చిందన్నారు. అప్పుడు ఆ బృందానికి క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసే స్థలాన్ని చూపించారన్నారు. కచ్చితంగా ఏర్పాటు చేసే స్థలాన్ని మాత్రం కేటాయించలేదన్నారు. నిర్మాణ లే అవుట్‌ను ఏర్పాటు చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. క్యాన్సర్ ఆసుపత్రి మంజూరైన తర్వాత అందుకు ఉండాల్సిన నియమ, నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. ఏసీఎస్‌ఆర్ మెడికల్ కళాశాలలో పనిచేసిన రేడియో థెరపీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసన్ 2013 నుంచి దీని కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. నిబంధనల మేర ఇక్కడ కొత్త సిబ్బందిని నియమించకపోగా ఉన్న ఇద్దరిలో ఒకరిని వేరే చోటకు డిప్యూటేషన్‌పై పంపించారన్నారు. టీసీసీసీ రావాలంటే క్యాన్సర్ చికిత్సకు సంబంధించి సేవలు నడుస్తుండాలనే షరతును విధించారాన్నారు. దాంతో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానించడానికి అంగీకరించడంతో క్యాన్సర్ సెంటర్ మంజూరైందన్నారు. తీరా త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేయాల్సిన దశలో రెడ్‌క్రాస్ కమిటీ వెనక్కు వేయడంతో నెల్లూరుకు క్యాన్సర్ సెంటర్ రాలేదన్నారు. దీనిపై జిల్లా మంత్రులు, డీఎంఈ, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇకనైనా ఈ సెంటర్ జిల్లాకు వచ్చేందుకు దృష్టిసారించాలని కోరారు. ఈ సమావేశంలో క్యాన్సర్ ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీనునాయక్, జి.శ్రీనివాసరావు, భాస్కర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, షాన్‌వాజ్ తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్ కేంద్రం ఏర్పాటులో ప్రభుత్వం విఫలం- క్యాన్సర్ హాస్పిటల్ సాధన కమిటీ కన్వీనర్ డాక్టర్
దత్తాత్రేయులు
Reviewed by ADMIN
on
March 17, 2018
Rating:
No comments: