ప్రేమించాడు...చంపేశాడు
ఒకవైపు భార్గవితో ప్రేమాయణం సాగిస్తూనే మరోవైపు పెళ్లికి రెడీ అయ్యాడు నరేష్. ఈనెల 4నే మరో యువతితో వివాహం నిశ్చయం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్గవి.. ప్రియుడు నరేష్‌ను నిలదీసింది. తనకూ ఆ పెళ్లి ఇష్టంలేదని.. పెద్దవాళ్లే బలవంతంగా చేస్తున్నారని నమ్మించాడు. వ్యవసాయ బావి వద్దకు వస్తే అన్నీ మాట్లాడుకుందామని... ఆపై యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. నరేష్ మాటలు నిజమని నమ్మిన భార్గవి.. పొలం దగ్గరికి వెళ్లింది. ముందే వేసుకున్న పథకం ప్రకారం భార్గవి తలపై బండరాయితో మోది చంపేశాడు. అనంతరం బావికోసం పూడిక తీసిన మట్టిలో పూడ్చిపెట్టాడు.
భార్గవిని పక్కా ప్లాన్‌తో హత్య చేసిన నరేష్.. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్టుగా మరునాడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు తమ కూతురు రెండు రోజులుగా కనిపించకుండా పోవడంతో భార్గవి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తుండడంతో ఆందోళన రెట్టింపు అయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ప్రేమ వ్యవహారంపై కూలీ లాగారు. నరేష్‌ను మొదట ప్రశ్నించగా ప్రేమించిన మాట వాస్తవమేనని.. ఆమె ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా అసలు నిజం బయటకు కక్కాడు. తనే భార్గవిని హత్య చేసినట్టు అంగీకరించాడు.
నరేష్ ఇచ్చిన సమాచారంతో వ్యవసాయ బావి దగ్గరి భార్గవి మృతదేహాన్ని బయటకు తీశారు. డెడ్‌బాడీని పోస్టుమార్టంకు పంపించి నరేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును కిరాతంగా హత్యచేసిన నరేష్‌ను కఠినంగా శిక్షించాలని భార్గవి తల్లిదండ్రులు కోరుతున్నారు.
No comments: