Top Ad unit 728 × 90

మేం చెప్పిన‌ట్లు వాళ్లు విన‌డం లేదు.. - అమ‌రావ‌తికి చేరిన నెల్లూరు పంచాయ‌తీ

The bullet news (Nellore)-  జిల్లాలో అధికారపార్టీ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. ఎర్రచందనం అక్రమ రవాణా మొదలుకుని భూవివాదాల వరకు అన్నింట్లోనూ అధికార పార్టీ శ్రేణులే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల అయితే ప్రత్యక్షంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు మాఫియాను నడిపిస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల పేరు చెప్పి అనుచరగణం పోలీస్‌స్టేషన్లలో హడావుడి చేస్తున్నారు. పర్యవసానంగా చిన్నపాటి వీధి గొడవ నుంచి భూవివాదాల వరకు అన్నింట్లో అధికారపార్టీ మితిమీరిన జోక్యం పోలీసులకు తలనొప్పిగా మారింది. కొందరు అధికారులు సమర్థవంతంగా పనిచేస్తే అమరావతి పంచాయితీ అంటూ హడావుడి చేయటం అధికారపార్టీ నేతలకు షరామాములగా మారింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ నేతలు, పోలీసుల మధ్య అంతర్గత పోరు కొన్ని నెలలుగా కొనసాగుతోంది. పోలీస్‌ స్టేషన్లలో అధికారపార్టీ కార్యకర్తలు, నేతల మితిమీరిన జోక్యం పోలీసులకు సమస్యాత్మకంగా మారుతోంది. సీఎం తరచూ సమీక్షలు నిర్వహించి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని పోలీస్‌ బాస్‌లకు హితబోధ చేస్తుంటే,  క్షేత్రస్థాయిలో పరిస్థితి  దీనికి పూర్తి భిన్నంగా ఉంది. కొందరు ప్రజాప్రతినిధులయితే మరీ అడ్డగోలు సిఫార్సులు చేయటంతో కొన్ని స్టేషన్లలో ఫిర్యాదులు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంటున్న పరిస్థితి ఉంది. జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించటంతో పాటు అక్రమాలను కట్టడి చేసిన ఎస్పీగా పీహెచ్‌డీ రామకృష్ణకు ప్రజల్లో మంచి పేరు ఉంది.


ట్రాఫిక్‌ సం స్కరణలు మొదలుకుని సిలికా అక్రమ రవాణా వరకు అన్నింట్లో సీరియస్‌గా పనిచేసి ప్రభుత్వ మన్ననలు పొందారు. అధికార సమీక్షల్లో జిల్లా మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ కూడా కలెక్టర్, ఎస్పీల పనితీరు బాగుందని కితాబు ఇస్తున్నారు. కానీ అంతర్గతంగా పార్టీ సమీక్షల్లో మాత్రం జిల్లా పార్టీ స్థితిగతులుపై సమీక్ష వదలేసి కలెక్టర్, ఎస్పీల గురించే చర్చించటం గమనార్హం. తాజాగా సోమవారం అమరావతిలో జిల్లా పార్టీ సమన్వయకమిటీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు కొందరు, ఓ సమన్వయకర్త ఎస్పీ, కలెక్టర్లు మాటవినడటం లేదని సీఎంకు ఫిర్యాదు చేయాలని మంత్రులను కోరా రు. మంత్రులు మాత్రం తాము అధికారులతో మాట్లాడుతామని చెప్పినట్లు సమాచారం. గతంలో క్రికెట్‌ బెట్టింగ్‌ రాకెట్‌ కేసులో సుమారు 400 మందిని పార్టీలతో నిమిత్తం లేకుండా పోలీసులు అరెస్ట్‌చేయడంతో ఎస్పీ పనితీరు బాగుందని జిల్లా మంత్రులు కితాబు ఇచ్చారు. ప్రస్తుతం వీధి పంచాయితీల నుంచి భూవివాదాల వరకు అధికార పార్టీ నేతలు సిఫార్సులు చేస్తుండటం, వాటిని పోలీసులు ఏకపక్షంగా చేయకపోవటం వివాదాలకు కారణంగా నిలుస్తోంది.


మరీ అడ్డగోలుగా..
జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి సర్కిళ్లల్లో అడ్డగోలు పంచాయితీలు జరుగుతున్నాయి. గతంలో ఆ ప్రాంత పోలీసులు పూర్తిగా అధికార పార్టీ నేతలు చెప్పిందే చేసేవారు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. గతంలో ఎస్సై మొదలుకుని డీఎస్పీల వరకు ప్రజాప్రతినిధులకు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలకు సాగిలపడి నెలవారీ మామూళ్లు సమర్పించేవారు. వీటితోపాటు ఇసుక, సిలికా, మద్యం తదితర వ్యాపారుల నుంచి సైతం మామూళ్లు వసూళ్లుచేసి అధికారపార్టీ నేతలకు ముట్టచెప్పేవారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎస్పీ చర్యలు అధికారపార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారాయి.


అయితే రెండుచోట్ల మాత్రం నేటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా గూడూరు సబ్‌ డివిజన్‌లో ఒక ఎమ్మెల్యే ఎర్రచందనం అక్రమ రవాణా మొదలుకుని జాక్‌పాట్‌ లారీల వరకు అన్ని తానై నడిపిస్తున్నాడు. వాటిపై ఎక్కడైనా పోలీసులు కేసులు నమోదు చేస్తే పోలీసు అధికారులు, సిబ్బందిపై శివాలు ఎత్తుతున్నారు. అక్రమరవాణా విషయాన్ని కప్పిపెట్టేందుకు ట్రాక్టర్, ఆటో డ్రైవర్లను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారంటూ తరచూ గొడవ చేస్తున్నారు. అలాగే మరో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తాను సిఫార్సు చేసిన ఎస్‌ఐలు, సీఐలకు పోస్టింగ్‌లు వేయడంలేదన్న అక్కసుతో ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారు. గతంలో సదరు ఇన్‌చార్జ్‌ స్టేషన్ల వారీగా రేట్లు నిర్ణయించి మరీ నెలవారీలు రూ.లక్షల్లో వసూలు చేసుకునే వారు. ప్రస్తుతం వీటన్నింటికీ బ్రేక్‌ పడటంతో జీర్ణించుకోలేకపోతున్నారు. వీటన్నింటిపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల పనితీరుపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

మేం చెప్పిన‌ట్లు వాళ్లు విన‌డం లేదు.. - అమ‌రావ‌తికి చేరిన నెల్లూరు పంచాయ‌తీ Reviewed by ADMIN on March 07, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.