ఫ్లెక్సీ ఫైట్‌గా మారిన హోదా పోరు...
The bullet news (Political)- హోదా పోరు ఫ్లెక్సీ ఫైట్‌గా మారింది. విజయనగరంలో టిడిపి, వైసిపి మధ్య వెరైటీ వార్ సాగుతోంది.హోదా ఉద్యమం, టిడిపి రాజీనామాలపై రెండు పార్టీలు హైడ్రామాకు తెరలేపాయి. ప్రత్యేక హోదా పోరాటంలో ముందున్నామంటూ ఫ్లెక్సీల ద్వారా విమర్శలకు దిగాయి. పట్టణంలోని ప్రధాన జంక్షన్ల వద్ద వెలిసిన ఫ్లెక్సీలు ఆసక్తిగా మారాయి.
కేంద్ర మంత్రి పదవికి అశోక్ గజపతిరాజు రాజీనామా వ్యవహారం విజయనగరంలో టీడీపీ, వైసీసీ మధ్య రాజకీయ వేడిని రగిలిస్తోంది. ప్రత్యేక హోదా పేరుతో రెండు పార్టీలు హైడ్రామాకు తెరలేపాయి. అశోక్ గజపతి రాజీనామా చేసిన తరువాత .. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి దంపతులు.. ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసారు. మీ త్యాగం అజరామరం-మీ చరిత ఆచరణీయం అంటూ అశోక్ గజపతిరాజు ఫోటోతో సహా పట్టణంలోని అన్ని ప్రధాన జంక్షన్లలో ఫ్లెక్సీలు వేశారు. రెండు రోజులకే వాటి పక్కనే వైసీపీ ఫ్లెక్సీలు వెలిసాయి. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తుందే మా నాయకుడు జగన్ అంటూ ఆ పార్టీ నాయకులు.. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి, బొత్స సత్యనారాయణ ఫోటోలతో ఎదురుదాడికి దిగారు.
అశోక్ గజపతిరాజుపై ఫ్లైక్సీలో వ్యక్తిగత విమర్శలు చేసారు వైసిపి నేతలు. రాజీనామా లేఖలో రాష్ట్ర ప్రజల మనోభావాలను ప్రస్తావించలేదని విమర్శించారు. పెద్ద సైజుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అశోక్ గజపతిరాజు రాజీనామా లేఖను ముద్రించి, మరోవైపు దాని తెలుగు అనువాదాన్ని కూడా రాశారు.
పదవి త్యాగం చేసిన అశోక్ గజపతిరాజు ఆచరణీయుడని టిడిపి ఫ్లెక్సీల్లో వేస్తే, నాలుగేళ్లు పదవి అనుభవించి, ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం వదులుకున్నాడని వైసీపీ ఫ్లెక్సీల్లో విమర్శించారు. ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. జిల్లా టీడీపీ నాయకులు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని వైసిపి ఎమ్మెల్సీ కోలగట్ల డిమాండ్ చేసారు.
అయితే రాష్ట్ర హక్కుల కోసం చేసిన రాజీనామాను రాజకీయం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దారుణమని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ప్రజల కోసం త్యాగం చేసి పార్లమెంటులో పోరాటం చేస్తుంటే విమర్శలు చేయడమేంటని విమర్శించారు. తమ ఉనికి చాటుకోవడానికే వైసిపి నేతలు ఈ రకమైన జిమ్మిక్కులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మొత్తానికి విజయనగరంలో ఫ్లెక్సీల్లో విమర్శలకు దిగుతూ ప్రజల ద్ళష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు నేతలు. ఎన్నికల ఏడాది కావడంతో మున్ముందు ఈ యుద్దం మరింత ముదిరే అవకాశాలున్నాయని పట్టణ ప్రజానీకం చర్చించుకుంటున్నారు.
ఫ్లెక్సీ ఫైట్‌గా మారిన హోదా పోరు...
Reviewed by ADMIN
on
March 17, 2018
Rating:
No comments: