వైసీపీ ఎమ్మెల్యేల విదేశీయానం!
The bullet news (Amaravathi)_ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అధికారపక్షమైన తెలుగుదేశం తన ఎమ్మెల్యేలను లాగేసుకుంటుందన్న భయం వైసీపీకి పట్టుకుంది. ఎన్నికల్లో ఎన్ని స్థానాలకు పోటీచేసేదీ టీడీపీ ప్రకటించకముందే.. తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని విదేశాలకు పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ బాధ్యతను సాక్షాత్తూ ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికే అప్పగించింది. ఇంకోవైపు.. ఆయన బుధవారం ఉదయం పది గంటలకు నామినేషన్ వేయనున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా బహిష్కరించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు కోసం బుధవారం అసెంబ్లీకి వచ్చి తమ కార్యాలయంలో కొద్దిసేపు గడిపి వెళ్లిపోతారు. వేమిరెడ్డి వెంట శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు ఉంటారు.
ఉన్న 44 మందీ జారిపోకుండా..
రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం మూడు స్థానాల్లో బరిలోకి దిగాలని టీడీపీ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం వైసీపీకి 44 మంది సభ్యులున్నారు. వీరిలో ఒకరిద్దరు జారిపోయినా రాజ్యసభ ఎన్నికల్లో పరాజయం తప్పదు. అందుకే వారిని ఎలాగైనా కాపాడుకోవాలని క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుడుతోంది. 44 మంది శాసనసభ్యులనూ విదేశాలకు తీసుకెళ్తారని చెబుతున్నా.. ఎక్కడికనేది బయటపెట్టడం లేదు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు బెడిసికొట్టనుందని.. టీడీపీ అభ్యర్థులకు బీజేపీ ఎమ్మెల్యేలు ఓటు వేయకపోవచ్చని.. అప్పుడు మూడు స్థానాలకు అధికార పక్షం పోటీచేయకపోవచ్చని వైసీపీ సీనియర్ నేతలు అంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేల విదేశీయానం!
Reviewed by ADMIN
on
March 07, 2018
Rating:
No comments: