పేద పిల్లల విద్యాభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు
The bullet news ( Nellore) _ కార్పోరేషనుకు ప్రస్తుతం చెల్లిస్తున్న నూతన గృహ నిర్మాణాల అభివృద్ధి పన్నులను అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా ఉండేలా సరళీకృతం చేస్తూ స్థాయీ సంఘం సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నామని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. నగర పాలక సంస్థ స్థాయీ సంఘ సమావేశాన్ని మేయరు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన శనివారం కార్పోరేషను సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు అభివృద్ధి పనుల అంశాలను చర్చించి కమిటీ ఏక గ్రీవంగా ఆమోదించారు. అనంతరం మేయరు విలేఖరులతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణ అభివృద్ధి పన్నులు నగరంలోని అభివృద్ధి చెందిన ప్రాంతాలకు సమానంగా శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల ప్రజలకు సైతం ప్రస్తుతం 14 శాతంగా నిర్ణయించబడి భారంగా మారాయనీ, ఆ సమస్యను గుర్తించి నగర వ్యాప్తంగా అభివృద్ధి పన్నులను ఏకీకృతం చేస్తూ కమిటీలో నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. పేద ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న 8 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానంగా తొలుత పది ప్రధమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్రాల్లో నూతనంగా వైద్యులు, నర్సులు, సహాయకులను నియమంచి ప్రజలకు సత్వర వైద్య సేవలను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మేయరు వివరించారు. బీడీ, చుట్ట తయారీ రంగ కార్మికులుగా మారి అనారోగ్యాలకు గురవుతున్న మహిళలూ, విద్యావంతులైనప్పటికీ వృత్తి ప్రావీణ్యం లేని స్త్రీల జీవితాలలో భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో వృత్తి నైపుణ్యా శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు సంకల్పించామని మేయరు వెల్లడించారు. వృత్తి నైపుణ్యా కేంద్రాల్లో అందించే సర్టిఫికెట్టు ఆధారిత వివిధ విభాగాల శిక్షణా, ఉపాధి అవకాశాలతో నగరంలోని ప్రతీ మహిళా ఆర్ధికాభివృద్ధి సాధించగలదని మేయరు ఆకాంక్షించారు. పేద పిల్లల విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అత్యంత ప్రశంసనీయమనీ, కార్పొరేటు విద్యకు దీటుగా మున్సిపల్ స్కూళ్ళలో అన్ని వసతులనూ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. సమావేశంలో తీసుకున్న అన్ని నిర్ణయాలనూ త్వరలో జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రవేశ పెట్టి సభ్యులందరి ఆమోదం పొందుతామని మేయరు తెలిపారు. ఈ సమావేశంలో కమీషనరు అలీం బాషా, స్థాయీ సంఘం సభ్యులు మన్నెం పెంచల నాయుడు, ప్రశాంత్ కిరణ్, శ్రీనివాసులు యాదవ్, మామిడాల మధు, అన్ని విభాగాల అధికారులూ పాల్గొన్నారు.
పేద పిల్లల విద్యాభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు
Reviewed by ADMIN
on
April 07, 2018
Rating:
No comments: