Top Ad unit 728 × 90

గుప్తనిధులు దొరికాయని.. కాజేసేందుకు పన్నాగం..

The bullet news(adoni)-   ఇది సినిమా సన్నివేశాన్ని తలపిస్తుంది. కాసేపు దిగ్ర్భాంతిలో ముంచెత్తుతుంది. అంత ఘరానా పథకం దీని వెనుక ఉంది. అయితే ఎలాంటి పకడ్బందీ కథనంలో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. ఇందులో కూడా అంతే. భారీ సెట్టింగ్‌తో సాగిన ఈ సన్నివేశమంతా ఒక అపోహ మీద నిర్మాణమైంది. అందువల్ల ఈ సన్నివేశం చూసిన వాళ్లు, విన్నవాళ్లు ఆశ్చర్యపోతే, ఇందులోని పాత్రధారులు అసలు విషయానికి హతాసులయ్యారు. పెద్దకడబూరు మండలం హెచ్‌.మురవణి గ్రామం దీని రంగస్థలం.
మొదటి సీన్‌..:

రయ్‌ అంటూ ఖరీదైన ఇన్నోవా వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఆరుగురు వ్యక్తులు దిగారు. ‘ఈ ఇల్లు ఎవరిది? ఇంట్లో ఎవరు లేరా..?’ అంటూ అక్కడున్న మహిళలను అడిగారు. ముందు వాళ్ల భయపడిపోయారు. ఓ మహిళ ముందుకు వచ్చి ఈ ఇల్లు తమదేనని చెప్పింది. ‘మేం ఇన్‌కంట్యాక్స్‌ అధికారులం. విజయవాడ నుంచి వచ్చాం.. ఈ ఇంట్లో తనిఖీలు చేయాల’ని అన్నారు. మహిళలు అయోమయంలో ఉండగానే ముగ్గురు ఇంట్లోకి చొరబడ్డారు. ఏం జరుగుతోందో , ఎందుకు జరుగుతోందో అక్కడున్న మహిళలకు తెలియలేదు. భయం.. ఆశ్చర్యం..


రెండో సీన్‌ ..:

ఇది నేపథ్యం..

హెచ్‌.మురవని గ్రామానికి చెందిన గోవిందు, ఉరుకుందు అన్నాదమ్ములు. పక్కపక్కనే ఉంటున్నారు. దాయాది అయిన వెంకటేష్‌ కూడా వారి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇటీవల గోవిందుకు పొలంలో గుప్తనిధులు భారీగా దొరికాయని వెంకటేష్‌ భావించాడు. 80 కిలోలు బంగారు, రూ.12 కోట్ల డబ్బు అన్న ఓ ఇంట్లో దాచేశాడని, ఆ ఇంటికి ఎప్పుడూ తాళం వేసి ఉండటానికి ఇదే కారణమని నమ్మాడు. ఆ సంగతి ఎలా తెలుసుకోవాలి? అందుకని అన్న దగ్గరికి వెళ్లి తాను పొలం కొంటున్నానని రూ.3 లక్షలు డబ్బులు కావాలని అడిగాడు. గోవింద్‌ తమ దగ్గర అంత డబ్బు లేదని, ఎక్కడి నుంచి తేవాలని అడిగాడు. దీంతో వెంకటేష్‌కు కోపం వచ్చింది. బనవాసిలో ఉన్న తన మిత్రుడైన తిక్కన్నకు గుప్త నిధుల సంగతి చెప్పాడు.


మూడో సీన్‌..

ఇదీ నేపథ్యమే..

అది ఆదోనిలోని ఓ లాడ్జి... జనవరి 28, 29, 30 తేదీలు.. వెంకటేశ్‌, బనవాసి కురువ తిక్కన్న, గోనెగండ్ల మండలం బైలుప్పలకు చెందిన నజీర్‌బాషా, దేవనకొండకు చెందిన ఆర్‌.చిరంజీవులు, కర్నూలు నగరానికి చెందిన చిరంజీవి, ఎమ్మెల్యే సమీప బంధువు శ్రీనివాసరెడ్డి, ఆలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు అనిల్‌కుమార్‌.. ఆలూరులోని కురువ మల్లికార్జున, పెద్దహోతూరుకు చెందిన కురువ హనుమంతు, మొళగవల్లి దాదాసాహెబ్‌, హేమంత్‌, అరికెర గ్రామానికి చెందిన తాహెర్‌వలీ..ఇలా ఎమ్మిగనూరు, ఆదోని, హైదరాబాద్‌, కడప, కర్నూలు, ఆలూరు ప్రాంతాలకు చెందిన 20 మంది. ఈ భారీ సమావేశం దేనికంటే హెచ్‌.మురవణికి చెందిన గోవిందు ఇంట్లో ఉన్నాయని భావిస్తున్న 80 కిలోల బంగారు, రూ.12 కోట్ల నగదు ఎలా కాజేయాలి అనే దాని మీదే. ?


నాలుగో సీన్‌

ఇరవై మంది.. రెండు బృందాలు..

అనిల్‌కుమార్‌ తోపాటు హనుమంతు, కందుకూరి చిరంజీవి, వంశీకృష్ణ, మన్సూర్‌, రహమతుల్లా, ఈశ్వర్‌రావు, కిరణ్‌, వెంకటేశ్‌ ఒక బృందం, కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డితో పాటు మరో తొమ్మిది మంది ఇంకో బృందంగా విడిపోయారు. శ్రీనివాసరెడ్డి బృందం ఎమ్మిగనూరు పట్టణ సమీపంలోని ఫైర్‌ స్టేషన్‌ దగ్గర ఎల్లెల్సీ కాల్వగట్టుపై మకాం వేశారు. అనిల్‌కుమార్‌ బృందం ఏపీ05 డీఆర్‌ 3555 ఇన్నోవా వాహనం, ఏపీ21 బీఎన్‌ 2714, ఏపీ21 ఎల్‌0357 ద్విచక్రవాహనాల్లో హెచ్‌.మురవణికి చేరుకున్నారు. ద్విచక్రవాహనాల్లో వచ్చిన ఇద్దరు రైతు గోవిందు ఇల్లు చూపించి వెళ్లిపోయారు. ఇన్నోవా కారులో వచ్చిన అనిల్‌కుమార్‌తో పాటు మరో ఆరుగురు గోవిందు ఇంటికి వెళ్లారు. ఇంటి బయట గోవిందు భార్య మంగమ్మ ఉంది. విజయవాడ నుంచి వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికారులం.. మీ ఇంట్లో సోదాలు చేయాలని చెప్పి ఇంట్లోకి వెళ్లారు. ఆమెకు దిక్కుతోచలేదు.. ఆమె బయట వ్యక్తులను పిలవకుండా ముగ్గురు ఆమెతో మాట్లాడుతుండగా.. మరో ముగ్గురు గోవిందు ఇంటితో పాటు తాళాలు పగులకొట్టి పక్కింట్లోనూ సోదాలు చేశారు.


ఐదో సీన్‌

దొరికిందేమిటంటే..

ఇల్లంతా గాలించారు. ఆ ఇంట్లో 80 కిలోల బంగారు, రూ.12 కోట్ల నగదు ఉందని వాళ్ల లెక్క. దాన్ని కైవసం చేసుకోవాలని వెతికారు. అదెక్కడా కనిపించలేదు. హతాసులయ్యారు. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాలేదు. అంచనాలు తారుమారయ్యాయా? అనుకున్నారు. అదేమోగాని సీన్‌ మాత్రం తారుమారైంది. ఆ ఇంట్లో బంగారు వర్ణం ఉన్న 138 పది రూపాయల నాణేలు, ఒక జత కమ్మలు, రెండు జతల బడెకడ్లు అనే బంగారు ఆభరణాలు మాత్రమే దొరికాయి.


అంతే.. అవి తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు. ఎమ్మిగనూరు దగ్గర ఉన్న శ్రీనివాసరెడ్డి బ్యాచ్‌ను కలిశారు. తమకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశాడని అనిల్‌కుమార్‌, కందుకూరు చిరంజీవి, పెద్దహోతూరు హనుమంతులు దేవనకొండకు చెందిన ఆర్‌.చిరంజీవితో గొడవపడ్డారు. శ్రీనివాసరెడ్డి వారికి సర్ది చెప్పాడు. అందరూ పరారయ్యారు. ఇందులో పాత్రధారులంతా 25-30 ఏళ్ల వాళ్లే. వీరిలో ఓ కంపెనీలో పని చేసే కడపకు చెందిన ఉద్యోగి కిరణ్‌కుమార్‌, హైదరాబాదుకు చెందిన షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌ చింతల ఈశ్వరరావు ఉన్నారు.



చివరి సీన్‌

శుభం కార్డుకు ముందు.. పోలీసులు.. అరెస్టులు

ఆదోని డీఎస్పీ అంకినీడు ప్రసాద్‌ ఈ కేసును విచారణకు ప్రత్యేక క్రైమ్‌ పార్టీని నియమించారు. సీసీ ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని పెద్దపార్కు, టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఉన్న నిందితులు ఆలూరుకు చెందిన అనిల్‌కుమార్‌, ఆదోనికి చెందిన కందుకూరు చిరంజీవి, వంశీకృష్ణ, మన్సూర్‌ బాషా, రహంతుల్లా, కడపకు చెందిన కిరణ్‌కుమార్‌, హైదరాబాద్‌కు చెందిన చింతల ఈశ్వర్‌రావు, పెద్దహోతూరుకు చెందిన కురువ హనుమంతు, మొలగవల్లి గ్రామానికి చెందిన హేమంత్‌, ములింటి దాదాసాహెబ్‌, అరికెరకు చెందిన తాయర్‌వలీ, దేవనకొండకు చెందిన ఆర్‌.చిరంజీవి, బైలుప్పలకు చెందిన ముల్ల నజీర్‌బాషా, ఎమ్మిగనూరు మండలం బనవాసికి చెందిన తిక్కన్న, హెచ్‌.మురవణికి చెందిన వెంకటేశ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు.


కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, నిరంజన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, సర్పంచ్‌ మల్లికార్జునలు పరారీలో ఉన్నారనీ, త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి ఇన్నోవా కారు, రెండు ద్విచక్రవాహనాలు, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేసును చేధించిన క్రైమ్‌ పార్టీ పోలీసులకు ఎస్పీ గోపినాథ్‌ జెట్టీ ద్వారా ప్రత్యేక అవార్డులు అందిస్తామని తెలిపారు.
గుప్తనిధులు దొరికాయని.. కాజేసేందుకు పన్నాగం.. Reviewed by ADMIN on February 28, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.