సిరియాలో రక్తమోడుతున్న బాల్యం
ఒకప్పుడు యుద్ధ సంక్షోభ సిరియా నుంచి సురక్షిత ప్రాంతానికి పడవలో వెళ్తూ మృతిచెందిన చిన్నారి అయ్లాన్ కుర్దీ ఫొటో యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతపరిచింది. సముద్రం ఒడ్డున విగతజీవిగా పడి ఉన్న ఆ బాలుడి ఫొటో అప్పట్లో అందరినీ కదిలించింది. ఆ తర్వాత కూడా సిరియాలో రక్తసిక్త దాడులు, ప్రభుత్వ దళాలు, వేర్పాటువాద మిలిటెంట్లు, ఉగ్రవాద సంస్థల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సిరియా హింసలో ఛిద్రమవుతున్న చిన్నారుల ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ‘ప్రే ఫర్ సిరియా’ (సిరియా కోసం ప్రార్థించండి) హాష్‌ట్యాగ్‌తో ఈ ఫొటోలను పంచుకుంటున్నారు.సిరియాలో ఛిన్నాభిన్నామైపోతున్న బాల్యాన్ని కాపాడాలని, మానవత్వాన్ని చూపాల ని, అక్కడి చిన్నారులకు కూడా అందరి బాలల్లాగే సంతోషంగా బతికే హక్కు కల్పించాలని, ఈ దిశగా ప్రపంచ దేశాల్ని కదిలించాలని కోరుతూ ఈ హాష్‌ట్యాగ్ ఉద్యమం నడుస్తోంది. తాజాగా టాలీవుడ్ నటి మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఈ హ్యాష్‌ట్యాగ్ జోడించి సిరియా చిన్నారి ఫొటోను ట్వీట్ చేశారు. సిరియాలో చిన్నారులు ఎదుర్కొంటున్న హింస, కూరత్వం, చిన్నారుల మారణహోమాన్ని చూస్తే హృదయం ద్రవించుకుపోతోందని, మానవత్వాన్ని చాటుతూ అక్కడ శాంతి కోసం ప్రార్థించాలని ఆమె ట్వీట్ చేశారు.
No comments: