చూపులకు చిన్నోళ్లు.. పనిలో పెద్దోళ్లు..
The bullet news(ongole)- చూసేందుకు వాళ్లిద్దరూ చిన్నోళ్లే.. ఒకరి వయసు 23 ఏళ్లు.. మరొకరికి 18 ఏళ్లు.. పనిలో మాత్రం మహా ఘటికులు.. 23 ఏళ్ల కుర్రాడిపై 28 చోరీ కేసులుంటే, 18 ఏళ్లకే 18 చోరీ కేసులతో ఆరితేరాడా నవ యువకుడు.. చోరీలు చేయడంలో పనితనాన్ని ప్రదర్శిస్తున్న ఆ ఇద్దరినీ ఒంగోలు తాలూకా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 51 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ. 13 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక తాలూకా పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ గంగా వెంకటేశ్వర్లు కేసు వివరాలు వెల్లడించారు. స్థానిక జయప్రకాష్ కాలనీకి చెందిన మోటా నవీన్ అలియాస్ శామ్యూల్ చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడతున్నాడు. 18 ఏళ్ల మరో యువకుడితో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిద్దరినీ తాలూకా ఎస్.ఐ. ఎన్.సి.ప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకుంది. వీరిలో నవీన్ అలియాస్ శామ్యూల్‌పై ఈ పాటికే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 28 చోరీ కేసులు నమోదు కాగా, మరొకరిపై 18 కేసులు ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్ గంగా ప్రసాద్ తెలిపారు. వీరిలో నవీన్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తామనీ, బాల నేరస్థుడిని జువైనల్ హోమ్‌కు తరలిస్తామని ఆయన వివరించారు. విలేకరుల సమావేశంలో ఎస్.ఐ దాసరి రాజారావు పాల్గొన్నారు. నిందితుల అరెస్టు, చోరీ సొత్తు రికవరీలో కీలకపాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ అన్వర్ బాషా, కానిస్టేబుళ్లు కె.శివ, షేక్ మౌలా, హోంగార్డు వాసులను డీఎస్పీ అభినందించినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
చూపులకు చిన్నోళ్లు.. పనిలో పెద్దోళ్లు..
Reviewed by ADMIN
on
March 01, 2018
Rating:
No comments: